ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2020, 9:26 PM IST

Updated : Jun 17, 2020, 10:53 PM IST

ETV Bharat / city

విశాఖను వణికిస్తున్న కరోనా... క్రమంగా పెరుగుతున్న కేసులు

విశాఖ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో... కరోనా బాధితుల​ సంఖ్య మూడువందల మార్కు దాటింది. ఇటీవల రోజుకు 10 నుంచి 25 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్​డౌన్​ సడలింపులతో ప్రజారవాణా తిరిగి ప్రారంభం అవ్వడం వల్ల విశాఖకు ప్రతి రోజు వచ్చే రెండు రైళ్లు, విమానాల ద్వారా దాదాపు రెండున్నర వేల మంది వస్తున్నారు. వీరిలో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. విశాఖకు విమాన సర్వీసులను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

విశాఖను వణిస్తున్న కరోనా... ఆరు రోజుల్లో 104 కేసులు
విశాఖను వణిస్తున్న కరోనా... ఆరు రోజుల్లో 104 కేసులు

విశాఖ నగరంలోని 98 డివిజన్లలో.. కొత్త కంటైన్​మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో అధికంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

లాక్​డౌన్ నిబంధనలు సడలింపు వల్ల దాదాపుగా అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారు. రెస్టారెంట్లు కూడా తెరుచుకోవటంతో...ప్రజల తాకిడి పెరిగింది. నగరంలో కంటైన్​మెంట్ నిబంధనల ప్రకారం 500+500 మీటర్ల వరకు వెరీ యాక్టివ్ క్లస్టర్లలో రాకపోకలను నియంత్రించారు. కనిష్టంగా ఈ నియంత్రణ 200 మీటర్ల వరకు ఉంటుంది. ఇలాంటి ఆంక్షలు ఉన్న ప్రాంతాలు దాదాపు 75 వరకు ఉన్నాయి. కొన్ని క్లస్టర్లలో కొత్తగా కేసులు నమోదు కాకపోవడం వల్ల వాటిలో ఆంక్షలు ఎత్తేశారు.

బయట ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగడం వల్ల కేసులు కూడా వేగంగానే పెరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. కేవలం 15 రోజుల్లోనే 225 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు. మే నెలలో కరోనా కేసులు తాకిడి పెరుగుతూ వచ్చింది. మే 31 నాటికి కేసుల సంఖ్య 113 కేసులకు చేరింది. ఆ తర్వాత కేవలం ఎనిమిది రోజుల్లోనే 99 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకూ అంటే ఆరు రోజుల్లోనే 104 కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతను సూచిస్తోంది. ఒక్క జూన్ నెలలోనే ఇప్పటివరకు 210 కొత్త కేసులు నమోదయ్యాయి.

విమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులను, వెంటిలేటర్ అవసరం ఉన్న కేసులను ఉంచుతున్నారు. గీతం, గాయిత్రి, ఛాతీ ఆసుపత్రులలోను కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా... ఇప్పటివరకూ 143 మంది కేసులు డిశ్చార్జి అవడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండటంతో కొంత ఊరటనిస్తోంది.

ఇదీ చదవండి :విశాఖ కేజీహెచ్​లో సిబ్బంది కొరత.. రోగుల అవస్థలు

Last Updated : Jun 17, 2020, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details