విశాఖ జిల్లాలో కొవిడ్ కేసుల రికవరీ యాభై ఐదు వేలు దాటింది. జిల్లాలో ఇంతవరకు నమోదైన కేసుల్లో మొత్తం డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 55,005 గా నమోదైంది. కొత్తగా కొవిడ్ బారిన పడుతున్న వారు తీవ్ర లక్షణాలకు లోనవుతున్న వారి శాతం, ఆసుపత్రులలో ఉంచాల్సి వస్తున్న వారి శాతం కేవలం ఐదారు శాతంగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది అసుపత్రులపై ఒత్తిడి తగ్గడానికి కారణమైంది. నాలుగు జిల్లాల కొవిడ్ ఆసుపత్రి విమ్స్లోనూ పదుల సంఖ్యలోనే బాధితులు చికిత్స పొందుతున్నారు.
ప్రతి రోజు కొత్త కేసుల సంఖ్య మాత్రం వంద నుంచి నూట యాభై వరకు ఉంటున్నాయి. యాక్టివ్ కేసులు సంఖ్య 1700 వరకు ఉంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57,179. మొత్తం మృతుల సంఖ్య 484 గా ఉంది. ప్రతి రోజు ఆరు నుంచి ఆరున్నర వేల మందికి జిల్లా వ్యాప్తంగా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. గరిష్ట స్థాయిలో జిల్లాలో ఆగస్టు నెలలో దాదాపు 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వీటి ఉద్ధృతి సెప్టెంబరు నెలలో తగ్గింది. అక్టోబరులో దాదాపు ఏడు వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 75 వరకు నమోదైంది.
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 550 పడకల కొవిడ్ వార్డులో నూట యాభై మంది వరకు బాధితులు ఉన్నారు. ప్రజలు కొవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు మాత్రం పాటించి తీరాలని, లేనట్టయితే ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా హోర్డింగ్లు పెట్టి, కాలనీలలో కొవిడ్ నివారణ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.