రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ రెండో దశ వ్యాప్తి.. ప్రజలను భయందోళనకు గురిచేస్తోంది. కేవలం 8 రోజుల వ్యవధిలోనే లక్షకుపైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ శరవేగంగా పాకిపోతోంది. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 2,129 పాజిటివ్ కేసులు నమోదవటం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏప్రిల్ నెలలో 26,967 కేసులు రాగా.. మొత్తం కేసుల సంఖ్య 1,04,919కి చేరింది. విజయనగరం జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న కొవిడ్ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం శ్రమిస్తోంది. కొవిడ్ పరీక్షలను వేగవంతం చేసి మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నామని జిల్లా పాలనాధికారి.. హరి జవహర్ లాల్ తెలిపారు. రోగులకు సరిపడ బెడ్లు, ఆక్సిజన్ నిల్వలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలియజేశారు.
విశాఖ జిల్లా మండల కేంద్రం చీడికాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కలకలం రేపింది. ఆసుపత్రిలో అధికారులు, సిబ్బందికి కలిసి మొత్తం ఐదుగురికి కరోనా సోకింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు తీవ్ర అస్వస్థతకు గురై అంబులెన్స్‌లోనే మృతి చెందిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. గతరాత్రిప్రభుత్వాసుపత్రిలో ఆంబులెన్స్‌లో ఇద్దరు మృతి చెందారు.