Dasapalla Lands: విశాఖ నగరంలోని అత్యంత కీలకమైన ప్రాంతం దసపల్లా హిల్స్. గవర్నర్ బంగ్లాగా వ్యవహరించే రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంతో పాటు ఉన్నతాధికారుల నివాసాలు ఇక్కడే ఉన్నాయి. నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ 60 ఎకరాల పైగా భూమిలో 16 ఎకరాలు న్యాయ వివాదాల్లో ఉంది. ఇది రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ భూమి విలువ దాదాపు 2 వేల కోట్ల రూపాయల పైమాటే. ఈ భూమి ఇప్పటి వరకు 22A అంటే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో ఉంది.
ఈ భూములుపై కన్నేసిన వైకాపా ఎంపీ విజయ్‌సాయిరెడ్డి.. వీటిని క్రమబద్ధీకరించేందుకు చక్రం తిప్పినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తొలుత తన మనుషులైన ఉమేశ్, గోపీనాథ్‌రెడ్డితో ఒక బినామీ కంపెనీ, కుమార్తె, అల్లుడితో మరో బినామీ కంపెనీ ఏర్పాటు చేయించారని తెలిపారు. దసపల్లా భూములు కొనుగోలు చేసిన వారితో తన బినామీ కంపెనీలకు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు 9.75 కోట్లు సైతం కుమార్తె బినామీ కంపెనీ నుంచే చెల్లించినట్లు.. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ సొమ్ము అవ్యాన్ రియాల్టర్స్ నుంచి ఎష్యూర్ డెవలపర్స్‌కు మళ్లినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.