CONTRACTORS PROTEST: ‘అంపశయ్యపై ఉన్నాం.. ఆదుకోండి.. నాడు ఉపాధి కల్పించాం.. నేడు ఉపాధి కోల్పోయాం.. ఆస్తులు కరిగాయి.. అప్పులు మిగిలాయి’ అంటూ పలు జిల్లాల గుత్తేదారులు విశాఖ జీవీఎంసీ సమీపంలోని గాంధీవిగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. సబ్కా (స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ‘ఆవేదన-4’ పేరిట బుధవారం నిర్వహించిన ఆందోళనకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పలువురు గుత్తేదారులు నల్ల చొక్కాలతో హాజరై నిరసన తెలిపారు.
సబ్కా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో బ్యాంకుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వేధింపులకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఓపిక పట్టామని... ఇక ఆ శక్తి నశించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్కా కార్యాలయ కార్యదర్శి ఎం.ఆర్.డి.ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గుత్తేదారుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. టెండర్లలో పాల్గొని నిబంధనల ప్రకారం పనులు పూర్తిచేసినా బిల్లులు ఇవ్వట్లేదని వాపోయారు. గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బిల్లులు మంజూరు కాలేదని చెప్పగానే ప్రత్యేకంగా జీవో ఇచ్చి నిధులు కేటాయించి న్యాయం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం తమ బాధలను పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.