సాగర్ జలాశయం నుంచి నాగార్జునకొండకు వెళ్లే లాంచీలకు గతంలో పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.120 రుసుంగా వసూలు చేసేవారు. కొండకు వెళ్లాలంటే జలాశయంలో 14 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ దూరం మొత్తం కూడా అటవీ వన్యప్రాణి విభాగం పరిధిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలో 40 శాతం తమకు చెల్లించాలని అటవీశాఖ పర్యాటకశాఖ ముందు ప్రతిపాదన ఉంచింది. నెలకు పర్యాటకుల సంఖ్యను బట్టి అటవీశాఖకు రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.7 లక్షలకు పైగా చెల్లించాలి. ప్రస్తుతం తెలంగాణ పర్యాటకశాఖ ఏటా రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు రాష్ట్ర విభజన తరువాత చెల్లిస్తుంది. ఏపీ మాత్రం ఇప్పటివరకు ఇటువంటి చెల్లింపులు ఏమి చేయడం లేదు. పర్యాటకుల సంఖ్య తగ్గిందని, ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పుకుంటూ వస్తుంది. ప్రస్తుతం లాంచీల రాకపోకలకు పర్యాటకశాఖ అనుమతులు ఇచ్చినా, అటవీశాఖ డబ్బుల చెల్లింపుల ప్రతిపాదన నేపథ్యంలో లాంచీలు కదలడం లేదు. ఈ సమస్య కొలిక్కి వస్తేనే కొండకు లాంచీలు పయనం కానున్నాయి. ప్రస్తుతం సాగర్‌కు వచ్చే పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
గోదావరిలో లాంచీ ప్రమాదం.. కరోనా ఆంక్షలు.. మొత్తం మీద రెండేళ్లుగా సాగర్ జలాశయంలో లాంచీ విహారం నిలిచిపోయింది. ప్రభుత్వం ఇటీవల పర్యాటక క్షేత్రాల్లో లాంచీ విహారానికి పచ్చజెండా ఊపింది. అయితే నాగార్జున సాగర్‌లో మాత్రం లాంచీలు ముందుకు కదల్లేదు. జలాశయంలో లాంచీలు తిప్పాలంటే తప్పనిసరిగా తమకు డబ్బులు చెల్లించాలని అటవీ శాఖ తేల్చి చెప్పింది. అటవీశాఖ, పర్యాటకశాఖ ఈ వ్యవహారంపై కొలిక్కి వస్తేనే లాంచీలు నాగార్జున కొండ వైపు కదలనున్నాయి.