విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక నేతలు, నిర్వాసిత సంఘాలతో.. వీఎన్ఆర్డీఏ హాల్లో కలెక్టర్ వినయ్ చంద్ భేటీ అయ్యారు. కేంద్రం నిర్ణయంపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ పలువురు కలెక్టర్ దగ్గర తమ గోడు వినిపించారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయింపు, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పన తదితర అంశాలను ప్రస్తావించారు. కార్మిక సంఘాలు, నిర్వాసిత సంఘాల వినతులను స్వీకరించిన వినయ్ చంద్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి, సీపీఎం రాష్ట్ర నేత నర్సింగరావు, ఉక్కు పరిశ్రమ ఉద్యోగుల సంఘం నేత మంత్రి రాజశేఖర్ రెడ్డి అప్పారావు, నిర్వాసిత సంఘాల ప్రతినిధి అప్పారావు పాల్గొని తమ ఆవేదన తెలియజేశారు.
జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద అఖిలపక్ష, కార్మిక, ప్రజా సంఘాల ఐకాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఈ నిరసన శిబిరాన్ని కొనసాగిస్తామని ఐకాస నేతలు చెబుతున్నారు. 'విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి' నేతృత్వంలో కూర్మన్నపాలెం గేట్ వద్ద దీక్షలు చేస్తూనే ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తామని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. సీపీఎం నాయకులు నర్సింగరావు ఈరోజు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.