ఎన్నికల నిర్వహణలో బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసుకోవడం అత్యంత కీలకమని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ స్పష్టం చేశారు. నామపత్రాల ఉపసంహరణకు ముందే డ్రాఫ్ట్ పత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు, తర్వాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ప్రకారం వరుస క్రమంలో ముద్రించాలన్నారు. ప్రతి అభ్యర్థికి మూడు గుర్తులు ఎంపిక చేసుకొనే వెసులుబాటు కల్పించాలన్నారు. సమయం తక్కువగా ఉందని, బ్యాలెట్ పత్రాలను 24గంటల వ్యవధిలో సర్వీసు ఓటర్లకు పంపాల్సి ఉంటుందన్నారు.
ఆర్‌ఓలు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ - విశాఖ జిల్లా తాజా వార్తలు
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ)పూర్తి సన్నద్ధతతో ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ స్పష్టం చేశారు. బుధవారం వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో ఎన్నికల విధులకు నియమితులైన అధికారులకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
● బ్యాలెట్ పత్రాలు తయారీ తర్వాత వాటిని జోనల్ కమిషనర్లు భద్రపర్చాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించాలని, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ ఏజెంట్లకు నియామక పత్రాలు జారీ చేయాలన్నారు. జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మాట్లాడుతూ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.
ఇదీ చదవండి:సీడ్‌యాక్సెస్ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం