Milan-2022 At Visakha : విశాఖలో జరుగుతున్న మిలన్-2022 కార్యక్రమానికి.. ఈ నెల 27న సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలు కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బీచ్ రోడ్ కి వెళ్లే రహదారులపై ఆక్రమణలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రానుండటంతో.. ఈ నెల 26, 27 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని విశాఖ పోలీసు కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా తెలిపారు.
బీచ్ రోడ్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్కుహోటల్ కూడలి వరకు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7.30 గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. కలెక్టరేట్ నుంచి కోస్టల్ బ్యాటరీ మీదుగా పార్కుహోటల్, సిరిపురం నుంచి చినవాల్తేరు మీదుగా పార్కుహోటల్ కూడలి, సిరిపురం నుంచి ఆల్ ఇండియా రేడియో మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు.. పాస్ లేని వాహనాలను అనుమతించబోమని చెప్పారు. ఎంవీపీ కాలనీ మీదుగా వచ్చే వాహనాలు ఎంజిఎం పార్కు, విశాఖ ఫంక్షన్ హాల్ వద్ద.. జగదాంబ, దండుబజారు వైపు నుంచి వచ్చే వాహనాలు ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ గ్రౌండ్, జూబ్లీ గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.
ఈనెల 27న విశాఖలో సీఎం..
ఈనెల 27న విశాఖ నగరానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. మిలన్ 2022 లో పాల్గోనేందుకు ఆదివారం మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరే సిఎం విశాఖ చేరుకుని నేరుగా నేవల్ డాక్ యార్డు సందర్శిస్తారు. ఇటీవలే నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను సందర్శిస్తారు. నౌక సందర్శన సందర్భంగా అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొని, నౌకను పరిశీలిస్తారు. నౌకాదళంలో తాజాగా చేరిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వేల ను సందర్శిస్తారు.