విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన ఆయన రెండు గంటలు శారదాపీఠంలో గడిపారు. పూర్ణాహుతికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నారు . పీఠం ప్రాంగణంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి సీఎం పూజలు చేశారు. అనంతరం అలంకార మండపంలో రాజశ్యామల అమ్మవారి అలంకార రూపాన్ని సందర్శిస్తారు.
గోమాతను పూజించి... జమ్మిచెట్టు చుట్టూ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్రలతో కలిసి ప్రదక్షిణ చేయనున్నారు. అక్కడినుంచి ఆగమయాగశాలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న రాజశ్యామల అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన విశ్వశాంతి హోమం, చతుర్వేద వాహనం వద్ద పూజలు నిర్వహిస్తారు. నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం పీఠంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌లు కార్యక్రమంలో హాజరయ్యారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌లు ఈ వార్షికోత్సవానికి హాజరయ్యారు.