విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధిత గ్రామాల్లో ముమ్మరంగా శానిటైజేషన్ జరపాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖలో గ్యాస్ లీక్ దుర్ఘటన, అనంతర పరిణామాలపై తాడేపల్లిలోని నివాసంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్యాస్ లీకేజీని అరికట్టడానికి తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గాలిలో గ్యాస్ పరిమాణం రక్షితస్థాయికి చేరిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నిపుణులు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నారని వివరించారు. బాధితులు కోలుకుంటున్న వైనం, చికిత్స అందుతున్న తీరును నివేదించారు.
బాధిత గ్రామాల్లో స్టైరీన్ గ్యాస్ అవశేషాల తొలగింపు చర్యలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అన్ని చర్యలు తీసుకున్నాకే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని స్పష్టం చేశారు. అలాగే దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఇవాళే పరిహారం అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి సోమవారం పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. మిగిలిన వారికి ప్రకటించిన విధంగా సహాయం అందించాలని అధికారులకు సూచించారు.