లాక్ డౌన్ దృష్ట్యా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఇతర అధికారులు హాజరయ్యారు. లాక్ డౌన్ వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపింది. వాటిని పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై జగన్ సమీక్షించారు. కొవిడ్-19 వల్ల ఈ పరిశ్రమలపై ఏ మేరకు ప్రభావం పడిందన్న దానిపై సమగ్రంగా చర్చించారు. ఈ తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్నవారి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సంస్థల బలోపేతం మయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు.
కేంద్ర మార్గదర్శకాల అనుగుణంగా ముందుకు
దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈల కోసం పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు ప్రకారం గ్రీన్ క్లస్టర్‌లో ఉన్న పరిశ్రమల వద్ద కొవిడ్ -19 నివారణ చర్యలు తీసుకుంటూనే తమ కార్యకలాపాలను ముందుకు కొనసాగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మెడ్‌టెక్‌లో ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్లు రూపకల్పన
సమీక్షకు ముందు రాష్ట్రంలో తయారైన ఇన్‌ఫ్రారెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ ధర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్‌లను సీఎం జగన్ ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు చెందిన గ్రీన్ ఓషన్ రీసెర్చ్ ల్యాబ్స్ దీన్ని రూపొందించాయి. వీటి పనితీరును ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు చెందిన గ్రీన్ ఓషన్ రీసెర్చ్ లేబ్స్ డైరెక్టర్స్ ఏ శృతి, ఎమ్ సాయిరాం సీఎం జగన్‌కు వివరించారు. దేశంలో తొలిసారిగా దేశీయంగా ఇన్‌ఫ్రారెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ థర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్‌లు తయారుచేస్తున్నామన్న గ్రీన్ ఓషన్ లేబ్స్ డైరెక్టర్స్ తెలిపారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అతి తక్కువ ఖర్చుతో స్థానికంగా ఉన్న ఉద్యోగులతోనే ఉత్పత్తి చేస్తున్నామని గ్రీన్ ఓషన్ లేబ్స్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు వేయి ఇన్‌ఫ్రారెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ థర్మామీటర్స్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తి అవుతోందని... త్వరలోనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే దిశగా ఉత్పత్తిని పెంచుతామని ముఖ్యమంత్రికి గ్రీన్ ఓషన్ లేబ్స్ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి :ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కి పదోన్నతి