ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం హేయమైన చర్య అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సీఎం జగన్‌ను కలవడంపై చంద్రబాబు మండిపడ్డారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ తెదేపా నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, డివిజన్ పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలు తెదేపా వెన్నంటే ఉన్నారని, స్వార్థంతో ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదన్నారు. నాయకులు వస్తారు.. పోతారని, పార్టీ, కార్యకర్తలు శాశ్వతమన్నారు. కార్యకర్తల అభిమానం, ప్రజాదరణ తెలుగుదేశం సొంతమని చంద్రబాబు స్పష్టం చేశారు. జెండాను మోసి గెలిపించేది కార్యకర్తలేనని, జెండా పంచన చేరిన నాయకులు కొందరు పార్టీకి ద్రోహం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతీ స్కీములో స్కాములే
ద్రోహులకు తెలుగుదేశం పార్టీలో స్థానం లేదన్న చంద్రబాబు.... ప్రజల గుండెల్లోంచి తెదేపాను ఎవరూ తొలగించలేరని తేల్చి చెప్పారు. పార్టీకి ద్రోహం చేసినవాళ్లకు రాజకీయ సమాధే అన్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కంచుకోట అన్నారు. హుద్ హుద్లో తెదేపా కష్టాన్ని ప్రజలు మరిచిపోరని, తెదేపా ఐదేళ్ల పాలనలో విశాఖ అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. వేల కోట్ల పెట్టుబడులు విశాఖకు తెచ్చి, లక్షలాది ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. అందుకే విశాఖలో 4 అసెంబ్లీ స్థానాలు తెదేపా గెలిచిందని గుర్తు చేశారు. వైకాపా వచ్చాక అన్నింటినీ నాశనం చేస్తోందని, వేలాది ఎకరాల భూములు కబ్జా చేశారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో వైకాపా దందాలు చేస్తుందని, ఇళ్ల స్థలాల ముసుగులో ల్యాండ్ స్కామ్‌లు, లెవలింగ్ పేరుతో వేల కోట్లు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. ప్రతి స్కీమ్‌లో స్కామ్‌లకు పాల్పడుతున్నారని విమర్శించారు.