ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉక్కు ఉద్యమాన్ని జగన్​ నడిపించాలి.. తెదేపా సహకరిస్తుంది: చంద్రబాబు

ఉక్కు ఉద్యమాన్ని జగన్‌ నడిపించాలని చంద్రబాబు అన్నారు. ఉక్కు పరిశ్రమ పోరులో వైకాపా ప్రభుత్వంతో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు రాజీనామాలకూ తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విశాఖలో పల్లా శ్రీనివాస్‌ను ఆస్పత్రిలో పరామర్శించి.. నిరశన దీక్ష విరమింపజేశారు.

By

Published : Feb 16, 2021, 3:47 PM IST

Updated : Feb 16, 2021, 5:38 PM IST

Chandrababu serious comments on Jagan Over steel plant Issue
Chandrababu serious comments on Jagan Over steel plant Issue

విశాఖ ఉక్కు పరిశ్రమపై మాట్లాడుతున్న చంద్రబాబు

స్టీల్‌ప్లాంట్ లేకపోతే విశాఖ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖలో పల్లా శ్రీనివాస్‌ను ఆస్పత్రిలో పరామర్శించిన చంద్రబాబు... ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారని చంద్రబాబు కొనియాడారు. ఆనాటి పోరాటానికి స్వయంగా ఇందిరాగాంధీనే దిగివచ్చారన్న చంద్రబాబు... అన్నిటికంటే విశాఖే మంచిదని ఆ రోజే కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.

ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని చంద్రబాబు నిలదీశారు. కమీషన్ ఏజెంట్లలా విశాఖను దోచుకోవాలని చూస్తున్నారా ప్రశ్నించారు. అల్లుడికి బయ్యారం.. గాలికి ఓబుళాపురం ఇచ్చారని.. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆ గనులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాజీనామాకు మేం సిద్ధం..

"కోడికత్తి డ్రామాలు వద్దు.. ఉక్కు ఉద్యమాన్ని జగన్‌ నడిపించాలి. విశాఖ ఉక్కు పరిరక్షణకు మీరేం చెప్పినా చేసేందుకు సిద్ధం. అందరమూ ఒక్కటై ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం. ప్రతిపక్ష పార్టీగా ఉక్కు ఉద్యమానికి అన్ని విధాలా సహకరిస్తాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేద్దామంటే మేం సిద్ధం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రతి తెలుగువాడి ఇంట్లో చర్చ జరగాలి." -చంద్రబాబు

భూమి విలువ వేల కోట్లు..

పోర్ట్ బేస్‌లో ఎక్కడా స్టీల్‌ప్లాంట్ లేదని.. విశాఖలోనే ఉందని చంద్రబాబు వివరించారు. ఆనాడు రైతులిచ్చిన భూమి విలువ ఇవాళ రూ.వేల కోట్లు ఉంటుందని చెప్పారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ.. విశాఖ ఉక్కు పరిశ్రమని... ఉక్కు పరిశ్రమ నుంచి ఇప్పటివరకు రూ.33 వేల కోట్ల పన్నులు కట్టారని చంద్రబాబు వివరించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కూడా రూ.వేల కోట్ల పన్నులు కట్టారన్న చంద్రబాబు... వాజ్‌పేయీ హయాంలో బీఈఎఫ్‌ఆర్‌కు వెళ్తే రూ.1,300 కోట్లు ఇచ్చి ఊపిరిపోశారని గుర్తుచేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమపై మాట్లాడుతున్న చంద్రబాబు

ఆర్థిక రాజధానిగా.. విశాఖే..

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఎప్పటికీ విశాఖే ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో విమానాశ్రయం, మెట్రోకు శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు... విశాఖకు ఐటీ పరిశ్రమ, లులు షాపింగ్‌మాల్‌ రాకుండా చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులూ ఇప్పుడు వెళ్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు పాలకులా.. కమీషన్‌ ఏజెంట్లా..? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు సంకల్పాన్ని కొనేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. సీఎం జగన్‌ ఏమయ్యారు..? పబ్జీ ఆడుకుంటున్నారా..? అని ఆగ్రహంగా ప్రశ్నించారు.

పాదయాత్ర ఎవరికి కావాలి?

సీఎం జగన్‌ రాష్ట్ర హక్కులను కాపాడలేకపోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు.. నిద్రపోతున్నారా..? అని నిలదీశారు. మేం తిరుగుబాటు చేస్తే వైకాపా నేతలు రోడ్డుపైకి రాలేరని హెచ్చరించారు. ఎ-2 పాదయాత్ర చేస్తారా.. ఆయన పాదయాత్ర ఎవరికి కావాలి..? అని ప్రశ్నించారు. పాదయాత్ర విశాఖలో కాదు.. ధైర్యముంటే దిల్లీ వెళ్లి అడగాలని సూచించారు. విశాఖ ఉక్కుపై తేలుకుట్టిన దొంగలా సీఎం ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పోస్కో ప్రతినిధులు విశాఖకు వచ్చింది నిజం కాదా..? పోస్కో ప్రతినిధులు 2 సార్లు సీఎంను కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం నిద్రపోయిందా..?

తెదేపా నేతలు ఎల్లప్పుడూ ప్రజల కోసమే పోరాడుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడబోమని ఉద్ఘాటించారు. విశాఖకు తలమానికంగా ఉన్న ఉక్కు పరిశ్రమను నాశనం చేస్తుంటే.. వైకాపా నేతలు ఏం చేస్తున్నారని నిలదీశారు. దేవాలయాలపై దాడులు చేసి... ప్రశ్నించిన తెదేపా నాయకులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటనపై తాను స్పందించే వరకు ప్రభుత్వం నిద్రపోయిందా..? అని ప్రశ్నించారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..

రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావాలని.. రాజారెడ్డి రాజ్యాంగం వద్దని ఉద్ఘాటించారు. పోలీసుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నారని.. ఏకపక్షంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేసి ఉంటే... పోలీసులు ఉద్యోగాలు చేసేవారా..? అని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని... ఈ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

ఇదీ చదవండీ... పల్లా శ్రీనివాసరావును పరామర్శించిన చంద్రబాబు

Last Updated : Feb 16, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details