విశాఖ సింహాచలంలోని సింహాద్రి అప్పన్న భక్తులు ప్రతి సంవత్సరం నియమ నిష్ఠలతో చేపట్టే శ్రీ నరసింహ దీక్షలు ఈ ఏడాది జరగనున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు దీక్ష చేపట్టాలని దేవస్థానం ఈవో సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఈ నెల 28న మాలాధారణ, వచ్చే ఏడాది జనవరి 8న దీక్ష విరమణ తేదీలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. భక్తులకు దేవస్థానం తరపున దీక్ష వస్త్రాలు, ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.
దీక్ష విరమణ రోజున మాల విసర్జన చేసిన భక్తులను మాత్రమే కొండపైకి అనుమతిస్తామన్నారు. ఆ రోజు సాధారణ భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని తెలిపారు. ఈసారి భక్తులకు దేవస్థానం తరపున మాల విసర్జన చేయడం జరగదని స్పష్టం చేశారు. దీక్షల విరమణ రోజున ఇరుముడి కొండపైన సమర్పణకు అవకాశం లేదని పేర్కొన్నారు.