Central Govt on Visakha steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో మరిన్నిపెట్టుబడులు వస్తాయని, ప్లాంట్ విస్తరణకు మరిన్ని అవకాశాలు వస్తాయని కేంద్రం పేర్కొంది. వ్యూహాత్మక విభాగంలో లేని ప్రభుత్వరంగ పరిశ్రమలను వీలైనచోట్ల ప్రైవేటీకరించాలని, అందుకు సాధ్యంకాకపోతే మూసేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కారాడ్ స్పష్టంచేశారు. సోమవారం లోక్‌సభలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై వైకాపా ఎంపీలు తలారి రంగయ్య, గొడ్డేటిమాధవి, గోరంట్ల మాధవ్, చింతా అనూరాధలు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు.
‘‘ఈ ఏడాది జనవరి 27న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌లో కేంద్రానికి ఉన్న 100% వాటాలను విక్రయించాలని నిర్ణయించారు. అనుబంధ, సంయుక్త వ్యాపార సంస్థల్లో ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఉన్న వాటాలనూ ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన విషయం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అయితే కేంద్రం అంతకుముందే వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకొంది. ప్రైవేటీకరణతో అదనపు మూలధనం, విస్తరణ సామర్థ్యం, అత్యుత్తమ సాంకేతిక, యాజమాన్య పద్ధతులు వస్తాయి. అప్పుడు ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఈ ప్లాంట్ అమ్మకం ఒప్పంద విధివిధానాలను ఖరారు చేసే సమయంలో తగిన నిబంధనలు చేర్చి ఉద్యోగులు, ఇతర భాగస్వాముల న్యాయబద్ధమైన కోర్కెలను పరిష్కరిస్తాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం కొత్త పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ విధానాన్ని ఖరారు చేసింది. ఇందులో భాగంగా వ్యూహాత్మకరంగాల పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కనిష్ఠస్థాయికి పరిమితమవుతుంది. ఈ విభాగంలోని మిగిలిన సంస్థలను ప్రైవేటీకరించడం, విలీనం చేయడం, లేదంటే ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అనుబంధంగా మారుస్తారు’’ అని భగవత్ కారాడ్ వివరించారు.