మాజీ ఎంపీ సబ్బం హరి మరణ వార్తి విని దిగ్భ్రాంతికి గురయ్యానని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విశాఖ అభివృద్ధికి సబ్బం హరి ఎంతో కృషి చేశారని కొనియాడారు. సబ్బం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చంద్రబాబు సంతాపం
సబ్బం హరి మరణంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ తెదేపా కార్యాలయంలో పార్టీ నేతలు నివాళులు అర్పించారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేతలు
సబ్బం హరి ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్ధ రాజకీయాలతో సబ్బం మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారన్నారు. కరోనా బారినపడి సబ్బం హరి మృతిచెందడం బాధాకరమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా ఆశించామని.. ఇంతలోనే మరణవార్త వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు.
'సబ్బం ఆకస్మిక మరణం విచారకరం'
సబ్బం హరి ఆకస్మిక మరణం విచారకరమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. సబ్బం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటించారు.
ఇదీ చదవండి:
మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత