నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. బాధ్యులైన పోలీసు, ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం వారి పేర్లు తెలియక పోవడం వల్ల గుర్తుతెలియని వారిగా కేసుల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో మేజిస్ట్రేట్ నమోదు చేసిన వాంగ్మూలంలో ఉన్న అంశాలను సీబీఐ.. కేసులో పొందుపరిచింది.
సీబీఐ ఎస్పీ విమలాదిత్య కేసును దర్యాప్తు చేయనున్నారు. నేరపూరిత కుట్ర, ప్రమాదకర ఆయుధాలతో గాయపరచడం, మూడు రోజులు అంతకుమించి నిర్బంధించడం, దొంగతనం సెక్షన్లు కేసులు పొందుపరిచిన తీరు తెలుసుకుంటున్నారు. ద్విచక్రవాహనం, కారు తాళాలు, పది లక్షల రూపాయల నగదు, ఏటీఎం కార్డులు, పర్సు, అందులోని వెయ్యి నగదు అపహరించారని డా.సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.