ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓబుళాపురం గనుల కేసులో రూటుమార్చిన సీబీఐ - సీబీఐ వాదన

ఓబుళాపురం గనుల కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే కొనసాగించాలని సీబీఐ... కోర్టుకు విన్నవించింది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ కేసును విశాఖ కోర్టుకు బదిలీ చేయాలన్న సీబీఐ... ఇప్పుడు వాదన మార్చింది.

సీబీఐ

By

Published : Oct 11, 2019, 1:26 AM IST

ఓబుళాపురం గనుల కేసులో వాదన మార్చిన సీబీఐ

ఓబుళాపురం గనుల లీజుల అక్రమాల కేసు వ్యవహారంపై సీబీఐ వాదన మార్చింది. ఓఎంసీ కేసును విశాఖకు బదిలీ చేయవద్దని హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే విచారణ జరపాలని కోరింది. లీజుల కేటాయింపు అక్రమాల కుట్ర ఎక్కువగా హైదరాబాద్​లోనే జరిగిందని నివేదించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు హైదరాబాద్​లోనే ఉండి నేరానికి పాల్పడ్డారని తెలిపింది. విశాఖ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తే కేసు విచారణ మరింత ఆలస్యమవుతుందని పేర్కొంది.

పునర్విభజన చట్టం ప్రకారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్​కి సంబంధించిన అంశాలు మాత్రమే ఏపీకి బదిలీ చేయాలని తెలిపింది. ఈ కేసులో అనంతపురంతోపాటు హైదరాబాద్​లో కూడా నేరం జరిగిందని వివరించింది. రాష్ట్ర విభజన జరగకముందే ఓఎంసీ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేసినట్లు తెలిపింది. విశాఖకు బదిలీ చేస్తే కేసు విచారణ మరింత జాప్యం జరుగుతుందని సీబీఐ పేర్కొంది.

ఇదీ జరిగింది...

ఉమ్మడి హైకోర్టు విభజన నేపథ్యంలో ఏపీకి సంబంధించిన కేసులను నవ్యాంధ్రలోని హైకోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ న్యాయస్థానాన్ని గత నెల 3న ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఓబుళాపురం గనుల వ్యవహారం అనంతపురం జిల్లాకు సంబంధించిన అంశం కాబట్టి విశాఖ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తే అభ్యంతరం లేదని ఈనెల 1న కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. తమకు కూడా అభ్యంతరం లేదని నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, అలీ ఖాన్, వీడీ రాజగోపాల్ కోర్టుకు తెలిపారు. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ కృపానందం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖకు బదిలీ చేయవద్దని సీబీఐ సవరించిన మెమో దాఖలు చేసింది. కేసు బదిలీపై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details