2019లో సీఎం అవ్వగానే జగన్ పోస్కోతో కలిసింది వాస్తవమేనని... 2020లో కూడా పోస్కో వాళ్లతో కలిశారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 3 రాజధానుల నాటకమాడి ఉత్తరాంధ్రలో భూ సర్వే చేసుకున్నారని ఆరోపించారు. ఏపీలో పెద్ద నగరం విశాఖలో లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయని.. రాజశేఖర్ రెడ్డి హయాంలో దోచుకున్నది వారికి సరిపోలేదంటూ ధ్వజమెత్తారు. ఎంపీ విజయసాయి రెడ్డికి ఏ హక్కు ఉందని పెత్తనం చేస్తున్నారని బుద్దా ప్రశ్నించారు.
విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర నుంచి తరిమేయాలని... ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకోవడానికే ఆయన విశాఖలో ఉంటున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైకాపా నేతలు... అధికారంలోకి వచ్చి ఏం సాధించారని నిలదీశారు. ప్రధాని మోదీని వైకాపా ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఒక బ్రాండ్ లాంటిదని.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రమంతటా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీతో చెప్పకుండా వ్యక్తిగతంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారన్నారు.