ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తొట్లకొండ బౌద్ధక్షేత్రాన్ని పరిరక్షించండి'

300 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని సినిమా క్లబ్​కు కేటాయించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బుద్ధిష్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం తగదని అన్నారు.

thotlakonda buddhist shrine
తొట్లకొండ బౌద్ధక్షేత్రం

By

Published : Apr 18, 2021, 4:48 PM IST

ప్రాచీన బౌద్ధ కట్టడమైన తొట్లకొండను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలని బుద్ధిష్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా తొట్లకొండను పరిరక్షించాలని కోరుతూ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ అంబేద్కర్ భవన్​లో మీడియా సమావేశం నిర్వహించారు.

జీవో నెంబర్ 21 ద్వారా తొట్లకొండపై 15 ఎకరాల భూమిని సినిమా క్లబ్​కు కేటాయించడాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. 300 ఏళ్ల నాటి చరిత్ర కల్గిన బౌద్ధ క్షేత్రం తొట్లకొండను వివిధ శాఖలకు కేటాయిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు.

ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం..

ప్రపంచంలోని ప్రాచీన బౌద్ధ కట్టడాలను పలు దేశాలు పరిరక్షిస్తూ ఉంటే.. రాష్ట్రంలోని బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించకపోగా, వాటిని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం ప్రజల మనోభావాలను కించపరచడమేనని వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే తొట్లకొండను కాపాడతామని సీఎం మాట ఇచ్చారని వెంకట రమణ గుర్తు చేశారు. ప్రస్తుతం దీనిపై నాయకులు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తొట్లకొండలో చేపడతున్న నిర్మాణాలన్నీ ఆపివేసి, జీవో నెంబర్ 21 రద్దుచేసి విశాఖపట్టణాన్ని బౌద్ధక్షేత్రంగా తయారుచేయాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర పాలజీ విభాగాధిపతి ఆచార్య సత్యపాల్, కమిటీ కో కన్వీనర్ మల్లయ్య రాజు, జిల్లా బోధి సొసైటీ ప్రధాన కార్యదర్శి బోర వేణు గోపాల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అలరించిన శ్రీమతి వైజాగ్ పోటీలు

ABOUT THE AUTHOR

...view details