BJP leader GVL on Rushikonda Issue: ప్రధాని మోదీ ప్రభుత్వం 8 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు భాజపా నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. నరేంద్ర మోదీ వల్ల ప్రపంచంవ్యాప్తంగా మన దేశ ఖ్యాతి పెరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 404 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖలోని భాజపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 6, 7 తేదీల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. 12, 13న కేంద్ర మంత్రి జయశంకర్, జూలై 4న ప్రధానమంత్రి మోదీ.. రాష్ట్రంలో పర్యటించనున్నట్లు జీవీఎల్ తెలిపారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుందన్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ త్వరలోనే కార్యరూపం దాల్చబోతోందని ఎంపీ జీవీఎల్ అన్నారు. రుషికొండలో నిబంధనలు తుంగలో తొక్కి సెవెన్ స్టార్ హోటల్‌ను ప్రభుత్వం నిర్మిస్తోందని జీవీఎల్ ఆరోపించారు. రుషికొండ నిర్మాణం వెనుక ప్రభుత్వ వైఖరి బయటపెట్టాలని.. లేనిపక్షంలో ఈ వ్యవహారంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. రిషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌ను శుక్రవారం సందర్శించనున్నట్లు చెప్పారు. అవినీతిని అరికట్టడానికి సీఎం జగన్ ఇచ్చిన ప్రకటన బాగుంది.. అయితే ఇందులో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల గురించి ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ పరిధిలోకి వీరు రారా.. అంటూ దుయ్యబట్టారు. విశాఖ జీవీఎంసీలో కార్పొరేటర్లు విస్తారంగా దండుకుంటున్నారని ఆరోపించారు.