రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వాయిదా వేయాలని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశాఖలో మాట్లాడిన ఆయన.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎన్నికల కమిషన్ గాని జోక్యం చేసుకుని తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రెండు నెలలు ఎన్నికలు వాయిదా వేసినంత మాత్రాన పోయేదేమీ లేదని అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా.. వైరస్ నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా వైరస్ నిర్ధరణ కోసం విశాఖలో ప్రత్యేక ల్యాబ్ సదుపాయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి పేర్నినానికి కృతజ్ఞతలు
విశాఖలో ఈనెల 12వ తేదీ రాత్రి నిమ్మకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న మంత్రి పేర్నినాని వెంటనే స్పందించి అతనికి చికిత్స చేయించారు. దీనిపై స్పందించిన భాజపా నేత విష్ణుకుమార్ రాజు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హోదాలో ఉన్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రుణ్ని ఆస్పత్రిలో చేర్పించడం మానవత్వానికి ప్రతీకని అన్నారు.