వివిధ ప్రభుత్వ పనులను చేస్తున్న కాంట్రాక్టర్లు.. బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. రహదారి నిర్మాణాలు, జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేసిన గుత్తేదారులకు కనీసం వేతనాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. దీంతో రాష్ట్రంలో గుత్తేదారులు ఎవరూ ప్రభుత్వం నిర్దేశించిన పనులు చేసేందుకు ముందుకు వచ్చే పరిస్ధితులు లేదని విమర్శించారు.
దీనికి భిన్నంగా.. కాంట్రాక్టర్లకు మా ప్రభుత్వం అసలు బకాయిలు పడలేదని రాష్ట్ర మున్సిపల్, ఆర్థిక శాఖ మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను మోసగిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్.. ఇకనైనా పద్ధతి మార్చుకొని గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.