మహారాష్ట్ర తరువాత రెండవ స్థానంలో ఏపీలోని జాతీయ రహదారుల నిర్మాణానికి(గ్రీన్ కారిడార్) సుమారు 25,500 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖ భాజపా కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో జిల్లాలను కలుపుతూ రహదారుల నిర్మాణానికి పిఎంజెఎస్వై పథకం క్రింద రూ. 2500 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. కొత్తగా 16 రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టుల కోసం 45 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. విశాఖపట్నంలో ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాల ఏర్పాటు, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ విస్తరణ వంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రమే నిధులను వెచ్చిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, విశాఖ అభివృద్ధికి భాజపా ఎంతో చేస్తుందన్నారు.
రాష్ట్రంలో భాజపా బలపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం.. నిస్వార్ధంగా అందిస్తున్న సహాయసహకారాల గురించి తెలుసుకున్న రాష్ట్ర ప్రజల నుంచి మద్దతు నానాటికీ పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో ఓర్వలేనితనంతో అధికార వైకాపా, ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న తెదేపాలు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని తమ దైనందిక చర్యగా పెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.