విశాఖలోని రాణీ చంద్రమదేవి - ఆర్సీడీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న జీవ వైవిధ్యవనానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. అంతరించిపోతున్న జీవజాతులపై భావితరాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో... డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీగా ఏర్పడ్డారు. దేశంలోని నలుమూలల నుంచి మొక్కల్ని సేకరించి ఇక్కడ ఉంచారు. 2 వేలకుపైగా వృక్షజాతులను చూడొచ్చు. 2001లో పార్క్ పనులు ప్రారంభంకాగా... 2002లో ప్రభుత్వ సహకారంతో ఆర్సీడీ ఆసుపత్రి ఆవరణలోని 3 ఎకరాల్లో మొక్కలు పెంచారు. ఆసక్తికొద్దీ 2013 దాకా సొసైటీ సభ్యులే తలో చేయి వేసి వనాన్ని నిర్వహించుకుంటూ వచ్చి అందంగా తీర్చిదిద్దారు.
2013 తరువాత ఆర్థిక ఇబ్బందులు రావడంతో... ఉడా అధికారులు ఈ వనాన్ని దత్తత తీసుకున్నారు. హుద్‌హుద్ తుపాను దాకా ఇది కొనసాగింది. ఆ తరువాత అధికారులు మారటం ఇతర కారణాలతో దత్తత సాయం ముగిసింది. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజలే విరాళాల ద్వారా నడిపిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ పార్క్‌ను ప్రభుత్వం గుర్తించకపోవటంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భావితరాలకు జీవవైవిద్య పరిజ్ఞానం అందించాలంటే ఇలాంటి వాటికి ప్రోత్సాహం అందించాలి. -ఎం.మంగతాయి, డీఎన్‌సీఎస్ సహవ్యవస్థాపకురాలు
ఇక్కడి మొక్కల్ని చూసేందుకు, నమూనాల్ని తీసుకెళ్లేందుకు ఎంతోమంది ఫార్మసీ, బాటనీ విద్యార్థులు, ప్రొఫెసర్లు వస్తుంటారు. ఈ పార్కులో దొరికే మొక్కల్ని పరిశోధించిన తర్వాత సుమారు 10కిపైగా జర్నల్స్ వెలువడినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -దుర్గాప్రసాద్, ఎంబీఏ విద్యార్థి