విశాఖ తీరంలోని తెన్నేటి పార్క్ సమీపానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ సరకు రవాణ నౌక ‘ఎం.వి.మా’ను సందర్శనాలయంగా మార్చేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావానికి గత నెల 12వ తేదీన తీరానికి కొట్టుకురాగా... ఇప్పటి వరకు వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా.... నౌకలోని ఇంధనాన్ని సైతం తోడించారు. నౌకను అక్కడి నుంచి సముద్రం లోపలికి తీసుకువెళ్లడానికి మరింత వ్యయం అవనుండడంతో సంబంధిత యజమాని తిరిగి తీసుకువెళ్లేందు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేయగా మరో రూ.5 కోట్ల వరకు అవుతుందని అంచనాకు రావడంతో తరలించడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. 2959 టన్నుల బరువు కలిగిన ఈ నౌకను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది సందర్శనాలయంగా మార్చాలన్నది తాజా ఆలోచన.
నౌక లోపలి భాగాలు, ఇంజిన్, సిబ్బంది పడక గదులు, వంటగదులు, కెప్టెన్, ఇతరులకు వినియోగించే గదులను లోపలి నుంచి వీక్షించేలా, వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్రవేశ మార్గాలతోపాటు నౌక పైభాగాన్ని ఆతిథ్య సేవలకు ఉపయోగించేలా ప్రణాళిక చేయనున్నారు.