మధురవాడ హత్య కేసు వివరాలు విశాఖలోని మధురవాడ సమీపంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనంలో బంగారునాయుడు అనే వ్యక్తి కుటుంబ సభ్యులు.. గత ఏప్రిల్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో కీలక ఆధారాలు లభించాయని నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు.
"ఈ ఏడాది ఏప్రిల్ 15న తెల్లవారుజాము 2.30 నుంచి 4 గంటల మధ్యలో భవనం నుంచి పొగలు వస్తున్న విషయాన్ని అక్కడి వారే చూశారు. ఆ సమయంలో కుటుంబసభ్యులు తప్ప ఇతరులెవరూ వారి ఇంటిలోకి రాకపోకలు చేయలేదని తేలింది. ఈ ఘటనలో బంగారునాయుడు పెద్ద కుమారుడు దీపక్.. అసలు నిందితుడిగా గుర్తించాం. మిగిలిన కుటుంబీకులు అందరినీ అతనే హతమార్చినట్లు భావిస్తున్నాం. ఇంట్లో ఖాళీ మద్యం సీసాలు లభించాయి కానీ.. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఎవరూ మద్యం తాగినట్లు నిర్ధారణ కాలేదు. తల్లిదండ్రులు బంగారునాయుడు, నిర్మలతో పాటు సోదరుడు కశ్యప్‌లను హతమార్చిన తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను కాల్చటానికి దీపక్ మద్యాన్ని ఉపయోగించాడు. అందువల్లే దీపక్ చేతిపై కాలిన గాయాలున్నాయి. ఆ తర్వాత దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చివరకి అతడు కూడా చనిపోయినట్లు భావిస్తున్నాం. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ చేశాం" - మనీష్ కుమార్ సిన్హా, విశాఖ పోలీస్ కమిషనర్
ఆ రోజు ఏం జరిగిందంటే..
ఈ ఏడాది ఏప్రిల్ 15న మధురవాడలోని ఆదిత్య ఫార్చ్యూన్ టవర్స్‌లో.. ఫ్లాట్ నెంబర్ 505లో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు వ్యాపించాయి. మిగతా ఫ్లాట్స్ వారు భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే ఫ్లాట్‌లో ఉన్న నలుగురూ సజీవ దహనమయ్యారు. మృతుల్లో బంగారునాయుడు, నిర్మల దంపతులు, వారి కుమారులు.. దీపక్ (22), కశ్యప్ (19) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరంతా విజయనగరం జిల్లా గంట్యాడ వాసులు.
బెహరాన్‌లో స్థిరపడిన బంగారునాయుడు నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలిసి విశాఖ వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య ఫార్చ్యూన్ టవర్స్‌లో అద్దెకు వచ్చారు. బంగారునాయుడు భార్య నిర్మల హోమియో వైద్యురాలు,పెద్ద కుమారుడు ఎన్‌ఐటీలో డిగ్రీ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. కశ్యప్ ఇంటర్మీడియట్ విద్యార్థి. మృతుల్లో పెద్దకుమారుడు మినహా మిగిలిన అందరిపై రక్తపు మరకలు ఉండటంతో.. కుటుంబ కలహాలతో అతడే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నేడు విచారణలో గుర్తించిన విషయాలు వెల్లడించారు.
ఇదీ చదవండి:
VIVEKA MURDER CASE: సీబీఐ విచారణకు హాజరైన ఉదయ్‌కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి