baby abducted: విశాఖ కేజీహెచ్‌లో బుధవారం రాత్రి నాలుగు రోజుల పసికందు అపహరణకు గురవడం కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు నగరంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు పిల్లలతో వెళ్తున్న వారిని ఆరా తీశారు. ఆటోలు, బస్సులను తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్య, నర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు.
అసలేం జరిగింది..
పద్మనాభం మండలం రౌతుపాలేనికి చెందిన అప్పాయమ్మ ఈనెల 13న కేజీహెచ్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. బుధవారం రాత్రి 7.25 గంటల సమయంలో ప్రసూతి వార్డుకు ఇద్దరు మహిళలు ఒకరు నర్సులా, మరొకరు ఆయాలా వచ్చి పాపను పరీక్షించాలని చెప్పి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పయమ్మకు అనుమానం వచ్చి తన బంధువులను పంపిస్తామని చెప్పగా, వారి అవసరం లేదని చెప్పి పాపను బలవంతంగా తీసుకువెళ్లారు. సమయం దాటుతున్నా బిడ్డను తీసుకురాకపోవడంతో తల్లి కంగారుపడింది. పాపను తీసుకెళ్లిపోయారని గుర్తించి కేకలు వేసింది. ఆసుపత్రి సిబ్బంది అక్కడికి చేరుకొని పసికందు అపహరణకు గురైనట్లు గుర్తించి స్థానిక ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీను పరిశీలించగా ఒక మహిళ హడావుడిగా బిడ్డను తీసుకువెళ్తున్నట్లు అందులో రికార్డు అయింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఇద్దరికి మించి పాల్గొని ఉండొచ్చని అనుమానిస్తుస్తున్నారు. క్యాజువల్టీ నుంచి బయటకొచ్చిన వారు కేజీహెచ్ గేటు వద్ద ఆటో ఎక్కినట్లు భావిస్తున్నారు.