Ayyanna On Ramatheertham Incident: రామతీర్థం ఘటనలో మాజీ కేంద్రమంత్రి, విజయనగర సంస్థానాదీశులైన అశోక్ గజతిరాజుపై దౌర్జన్యం చేసిన ఉదంతంపై ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు స్పందించాల్సిన అవసరముందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. సింహాచలం, పైడిమాంబ వంటి దేవాలయాలను నడిపిస్తూ వేలాది ఎకరాల భూములను అశోక్ గజపతి రాజు కుటుంబం ధారాదత్తం చేశారన్నారు. అటువంటి ఉన్నత విలువలు కలిగిన అశోక్ గజపతిరాజుపై నోరు జారటం తగదని హెచ్చరించారు.
వివాదం ఏంటంటే..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోడికొండపై రామతీర్థం కోదండరాముని ఆలయ పునర్నిర్మానికి ఈనెల 22న శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కొండపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్ పాటించలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త అయిన తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కనీసం తేదీలు నిర్ణయించే ముందూ చెప్పలేదన్నారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది తీసుకొస్తున్న శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అధికారులు, అక్కడున్న వారు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
హిందూ ధర్మాన్ని కాపాడాలి..
దేవదాయ శాఖ ఆనవాయితీని వైకాపా ప్రభుత్వం పాటించట్లేదని అశోక్‌గజపతిరాజు అన్నారు. ట్రస్టు బోర్డులను గౌరవించే పరిస్థితి ఈ సర్కారుకు లేదని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై 147 దాడులు జరిగాయని... ఈ ఘటనల్లో ప్రభుత్వం ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయిందని అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి.. ఏడాది తర్వాత శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని.. ఆలయ పునర్నిర్మాణంలో నిబంధనలు పాటించట్లేదని చెప్పారు. అమరావతి రైతుల మాదిరిగానే తనను కూడా ప్రభుత్వాధికారులు వేధిస్తున్నారు అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.