విశాఖ అథ్లెట్ల చిరకాల కల నెరవేరబోతుంది...! విశాఖలో అథ్లెటిక్ ట్రాక్‌లు ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో 'స్పోర్ట్స్ సిటీ'లు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖ అగనంపూడిలో 150 ఎకరాల్లో రూ.1300 కోట్లతో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపడతామని, ముందుగా విశాఖ, విజయనగరం, తిరుపతిల్లో ఈ స్పోర్ట్స్ సిటీలు ఏర్పాటవుతాయని వివరించారు. వీటిని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించనున్నట్టు ప్రకటించారు.
అగనంపూడిలో స్పోర్ట్స్ సిటీ
అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించేందుకు తగిన సదుపాయాలను విశాఖలో కల్పిస్తున్నామని... అందులో భాగంగా విశాఖలో రెండు సింథటిక్ ట్రాక్‌లు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలోని కొమ్మాది ప్రాంతంలో ఏర్పాటవుతున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రూ.7 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ నిర్మిస్తున్నామన్నారు. అగనంపూడి స్పోర్ట్స్ సిటీకి సంబంధించి ఇప్పటికే 80 ఎకరాల స్థలం క్రీడల శాఖకు అప్పగించారని, రానున్న కాలంలో కామన్‌వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ వంటి అంతర్జాతీయ క్రీడలకు విశాఖ వేదికవనుందని క్రీడలు, యువజన శాఖ ఇన్‌చార్జి బి.శ్రీనివాసరావు అన్నారు.
ఎనిమిది లేన్ల ట్రాక్‌లు
కేరళ రాజధాని తిరువనంతపురంలోనే ఆరు సింథటిక్ ట్రాక్‌లు ఉన్నయన్న శ్రీనివాసరావు... ఆ కారణంగానే కేరళ నుంచి పి.టి.ఉష, అంజూ జార్జ్ వంటి ఎంతమందో అథ్లెట్లు అంతర్జాతీయ క్రీడా వేదికలపై ప్రతిభను చాటరన్నారు. ఇప్పటివరకూ విశాఖ నగరంలోని మట్టి, పచ్చిక ట్రాక్‌లపై అథ్లెటిక్స్ అభ్యసిస్తున్న... ఔత్సాహిక క్రీడాకారులకు రానున్న కాలంలో ఎనిమిది లేన్ల సింథటిక్ ట్రాక్‌లు అందుబాటులోనికి వస్తే, వారి ప్రతిభ మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
ఇదీ చదవండి :
ఫిట్‌నెస్ కోసం క్రీడా సముదాయం... తితిదే ఉద్యోగులకు మరో వరం...