ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

special busses for sankranti : పండగ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు

సంక్రాంతి పండగకు నడపనున్న ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు ఉంటాయని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ తెలిపారు. పండగ కోసం ఈనెల 7 నుంచి 18 వరకు రెగ్యులర్‌ సర్వీసులతోపాటు అదనంగా 6,970 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

పండగ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు
పండగ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు

By

Published : Jan 7, 2022, 4:49 AM IST

సంక్రాంతి పండగకు నడపనున్న ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు ఉంటాయని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు తెలిపారు. గురువారం ఆయన విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. పండగ కోసం ఈనెల 7 నుంచి 18 వరకు రెగ్యులర్‌ సర్వీసులతోపాటు అదనంగా 6,970 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ ఆర్టీసీ అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక సర్వీసులు నడపటం వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి నష్టమే కదా’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘నేను మునగాలి.. పక్కనున్న వాళ్లూ మునగాలి అనే ధోరణి సరికాదు. నువ్వా-నేనా అనేలా కాకుండా.. నువ్వు-నేను అనే స్థితికి రావాలి. ప్రభుత్వ రంగ సంస్థలు సమష్టిగా పని చేస్తే రెండింటికి మేలు కలుగుతుంది. డీజిల్‌ ధరలు 50-60 శాతం పెరిగినా మేం ఛార్జీలు పెంచలేదు. ప్రత్యేక బస్సులు ఓవైపు ఖాళీగా వెళ్తాయి. అందుకే 50 శాతం ఛార్జీ అదనంగా తీసుకుంటున్నాం. మా రేట్లు సహేతుకంగా ఉంటాయి. ఏపీ, తెలంగాణ ప్రజలు ఏపీఎస్‌ఆర్టీసీని ఆదరిస్తున్నారు. కొత్త బస్సులు, మంచి సౌకర్యాలను కల్పిస్తున్నాం. రూపాయి ఎక్కువైనా ప్రజలు మంచి సేవలు పొందేందుకు చూస్తారు’ అని ఎండీ తెలిపారు.

లీజుకు మరో 27 బస్టాండ్ల స్థలాలు

ఇప్పటికే 9 బస్టాండ్లలో ఖాళీ స్థలాలు లీజుకు, అభివృద్ధికి ఇచ్చే ప్రక్రియ జరుగుతోందని, తాజాగా మరో 27 స్థలాలనూ గుర్తించినట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కమిటీ నివేదిక ఇచ్చిందని, అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ అద్దెకు తీసుకుంటున్న విద్యుత్తు బస్సుల్లో తొలి బస్సు వచ్చే నెల రానుందని చెప్పారు. డీజిల్‌తో నడిచే వాటిని విద్యుత్తు బస్సులుగా మార్చే ప్రణాళిక కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఛార్జీలు పెంచే ఆలోచన లేదని పేర్కొన్నారు.

విజయవాడకు రూ.3 వేలు.. విశాఖకు రూ.5 వేలు
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ట్రావెల్స్‌ టికెట్‌ ధరలు

ఓ ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ జనవరి 7న హైదరాబాద్‌-విజయవాడకు ఏసీ స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.1,200 వసూలు చేస్తోంది. జనవరి 12న అదే టికెట్‌ ధర రూ.3 వేలుగా నిర్ణయించింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికుల గుండెల్లో బస్సులు పరిగెడుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖ సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల్ని ప్రైవేటు ట్రావెల్స్‌ నిలువు దోపిడీ చేస్తుండటమే దానికి కారణం. దాదాపు అన్ని ఏజెన్సీలు కూడబలుక్కుని ధరలను పెంచేశాయి. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు స్లీపర్‌లో గరిష్ఠంగా రూ. 600గా ఉన్న ధర, ఇప్పుడు రూ. వెయ్యి నుంచి రూ. మూడు వేల వరకూ పెరిగింది. ప్రస్తుతం విశాఖకు గరిష్టంగా రూ.3 వేల వరకు ఉండగా, 11, 12 తేదీల్లో రూ.5వేల వరకు ఉంది. ఈ ధరలు విమాన ప్రయాణానికి సమానంగా ఉండటం గమనార్హం.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details