ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2020, 8:40 PM IST

ETV Bharat / city

కష్టాలు తీర్చే సింహాద్రి అప్పన్నకు ఆర్థిక సమస్యలు

అందరి కష్టాలు తీర్చే అప్పన్నకు ఆర్థిక సమస్యలు వచ్చి పడ్డాయి. కొవిడ్ సమస్య ఓ వైపు.. డిపాజిట్లు ఉన్నా పట్టించుకోని పాలక మండలి ఛైర్మన్ అలసత్వం మరోవైపు.. ఫలితంగా స్వామి సేవ చేసుకునే వారికి ఆకలి వెతలు తప్పడం లేదు. కనిపించని ఆదాయ మార్గం, పెరుగుతున్న బకాయిల భారం వెరసి సమస్య తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు చేపట్టక పోవడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముందస్తు ప్రణాళిక అమలు చేయని వైఫల్యం సంగతి అటుంచితే పరిష్కార మార్గాలపై కనీసం దృష్టి సారించని వైనం విస్తుపోయేలా చేస్తోంది.

Appanna Temple
Appanna Temple

అందరికీ కొవిడ్ కష్టాలు మార్చి నెల నుంచి మొదలైతే.. అప్పన్న దేవాలయానికి మాత్రం ఈ ఏడాది తొలి మాసంనుంచే ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఆర్థిక భారాన్ని గుర్తించని నిర్లక్ష్యం ఫలితంగా శాశ్వత ఉద్యోగులు అర్థాకలితో అలమటించాల్సిన దుస్థితికి పరిస్థితి దిగజారింది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న దేవస్థానానికి ఆదాయం 10కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది.

ఫలితంగా మార్చి నెల తరువాత నుంచి ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. పదవీ విరమణ చేసిన వారి పింఛన్లపైనా ఆదాయ ప్రభావం పడింది. స్వామికి నిత్య పూజలు చేసే పూజారుల నుంచి ఇతరుల వరకు ఇలా ప్రతిఒక్క శాశ్వత ఉద్యోగి సగం జీతాలతో అరకొర బతుకును ఈడ్చాల్సి వస్తోంది. ఇదంతా గత నెల వరకు ఉన్న పరిస్థితి. ఈ నెల అయితే పూర్తిగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ సైతం ఇబ్బందిగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బయటకు చెప్పుకోలేక.. తినడానికి అవస్థలు పడుతూ.. ఆర్థిక భారం నుంచి గట్టెక్కించమని మౌనంగా స్వామిని వేడుకుంటున్నారు. జీతాల సమస్య కొవిడ్ కారణంగా వచ్చిందైతే దేవస్థానానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు జనవరి నుంచి చెల్లింపులు నిలిచి పోయాయి. స్వామి వారి నిత్య సేవల కోసం సరఫరా చేసే పువ్వులు, నిత్యవసర సరకులు వంటి వాటికి సంబంధించిన బిల్లులు గత 9 నెలలుగా పెండింగ్ లోనే ఉన్నాయి.

ఇలా మొత్తం 9 కోట్ల రూపాయల మేర బకాయిలు దేవస్థానానికి ఉన్నాయి. ఇన్ని విధాల సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా పరిష్కరించాలి. ఆదాయాన్ని ఎలా మకూర్చుకోవాలి. పొదుపు ఎలా పాటించాలి అనే విషయాలపై పూర్తి స్థాయి నిర్లిప్తత ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం రోజు వారీ ఆదాయం రెండు లక్షల రూపాయల మేర వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. శాశ్వత, ఒప్పంద ఉద్యోగుల సంఖ్య మొత్తంగా 8 వందలు ఉండగా వీరందరికీ ప్రతి నెల పూర్తి జీతాలు ఇవ్వాలి అంటే 2 కోట్ల 46 లక్షల రూపాయల అవసరం ఉంటుంది.

ఇంజినీరింగ్ పనుల కోసం ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు చేయడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. దేవ స్థానంకు బ్యాంకుల్లో వంద కోట్ల రూపాయల మేర డిపాజిట్లు ఉన్నాయి. అందులో నుంచి కొద్ది మొత్తం డ్రాచేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటు రెండు నెలల క్రితం దేవస్థానం ఈఓ నుంచి పాలక మండలి ఛైర్ పర్సన్ కు ప్రతి పాదనలు అందినా.. ఇప్పటికీ దానిపై ఏ విధమైన నిర్ణయం జరగలేదు. అప్పన్న ఉద్యోగుల ఆకలి కేకలపై ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉంది.

అసలే కొవిడ్ కాలంలో తీవ్ర ఆర్థిక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో చాలీ చాలని జీతాలు చెల్లిస్తూ ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేయవద్దని అప్పన్న దేవస్థానం సిబ్బంది కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పసిడి మరింత ప్రియం- నేటి ధరలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details