విశాఖ జిల్లాలో ఇప్పటికే రాత్రి 10గంటలు తర్వాత కర్ఫ్యూ అమలులో ఉంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించారు. ప్రజలు గుంపులుగా తిరగడం, రోడ్ల మీదకు రావడం చేయకూడదు. అన్ని రకాల వ్యాపార సంస్థలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
పక్కాగా పర్యవేక్షణ
కొవిడ్ కేసుల నియంత్రణలో భాగంగా రాత్రి సమయంలో విధించిన కర్ఫ్యూను పక్కాగా అమలు జరిగేలా పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చిన సంగతి తెలిసిందే. అలానే రెస్టారెంట్‌లు, హోటళ్లు, లాడ్జిల్లో ఇటీవల ప్రత్యేక డ్రైవ్ చేపట్టి సీసీ కెమెరాలను అమర్చారు. వీటన్నింటినీ పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. దీంతో ఇక్కడ నుంచి అన్ని కెమెరాలను నిత్యం పరిశీలిస్తూ, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కర్ఫ్యూ అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీసులు మరింత ఎక్కువమందితో పహారా కాయనున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుడూ నిఘా ఉంటుంది.
ఇదీ చదవండి:కరోనా మృతుల అంత్యక్రియలకు, ప్లాస్మా దాతలకు ప్రభుత్వ సాయం