ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం - ap high court directs cbi on doctor sudhakar case news

విశాఖ వైద్యుడు డా. సుధాకర్ అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. . సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. 8 వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది.

ap high court
ap high court

By

Published : May 22, 2020, 2:02 PM IST

Updated : May 22, 2020, 6:05 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన ప్రభుత్వ వైద్యుడు డా. సుధాకర్ అరెస్ట్ వ్యవహారంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అరెస్టు జరిగిన తీరుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. సంబంధిత పోలీసులపై 8 వారాల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. మే 16 వ తేదీన సుధాకర్ అనూహ్య పరిస్థితుల్లో విశాఖ నగరంలో అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టు అమానవీయంగా జరిగిందని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత కోర్టుకు లేఖరాశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణ చేపట్టింది.

వివాదం ఇదీ...

కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు ఎన్​95 మాస్కులు ఇవ్వడం లేదంటూ.. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్యుడు సుధాకర్.. ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో.. 8 ఏప్రిల్​ 2020న డాక్టర్ సుధాకర్​ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఎలాంటి విచారణ, సంజాయిషీ నోటీసు కూడా లేకుండా సస్పెండ్ చేయడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

సుధాకర్ అరెస్ట్

ఆ తర్వాత సుధాకర్ అనూహ్యంగా విశాఖలో అరెస్టు అయ్యారు. మే 16న విశాఖలో పోర్టు ఆసుపత్రి ఎదుట అర్ధనగ్నంగా.. గుర్తు పట్టడానికి వీలు లేకుండా గుండుతో ఉన్న డాక్టర్ సుధాకర్​ను పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్ మద్యం సేవించి వచ్చిపోయేవారితో గొడవ పడుతున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదుతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆయన చేతులు వెనక్కు విరిచి కట్టేశారు. ఆయన్ను లాఠీతో కొట్టారు. ఆ తర్వాత ఆటోలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సుధాకర్‌ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు సుధాకర్​పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసే సమయంలో డాక్టర్​ను కానిస్టేబుల్ కొట్టిన వీడియో బయటికొచ్చింది. సుధాకర్ అరెస్ట్​పై విశాఖ సీపీ ఆర్కే మీనా వివరణ ఇచ్చారు. సుధాకర్ మద్యం తాగి రోడ్డుపై హల్​చల్ చేశారని చెప్పారు. అరెస్టు చేసే సమయంలో ఆయన వైద్యుడని స్థానిక పోలీసులకు తెలియదన్నారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశారు.

హైకోర్టులో వ్యాజ్యం దాఖలు..
డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఒక వైద్యుడి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని... ప్రభుత్వ ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు హైకోర్టులో కేసు వేశారు. తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా వీడియో సాక్ష్యాలతో హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆయన వాంగ్మూలం తీసుకోవాలని ఆదేశించింది. 20 వతేదీన విశాఖ జిల్లా ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్డి సుధాకర్ నుంచి వాంగ్మూలం సేకరించారు. దానిపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. పోలీసులపై సీబీఐ కేసుకు ఆదేశించింది.

ఇదీ చదవండి:

ఎన్​-95 మాస్కుల నుంచి మానసిక ఆసుపత్రి వరకూ..!

Last Updated : May 22, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details