హైజాక్ నిరోధక సన్నద్ధత కోసం ఏడాదికోసారి చేసే విన్యాసాలు విశాఖ విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ విన్యాసంలో నేవీ, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, రాష్ట్ర పోలీసు దళాలు పాల్గొన్నాయి. హైజాక్ పరిస్థితులు కృత్రిమంగా కల్పించి, వాటిని ఏ రకంగా ఎదుర్కొంటారనే అంశాన్ని ఈ విన్యాసాల ద్వారా పరీక్షిస్తారు. మెరైన్ కమెండోలు పూర్తి స్థాయిలో తమ సన్నద్ధతను ప్రదర్శించారు. వీరికి సహాయంగా సీఐఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ దళాలు తమ వంతుగా బాధ్యతలు నిర్వర్తించారు. యాంటీ హైజాక్ ఆపరేషన్ల సమర్థంగా నిర్వహించడం ద్వారా భద్రతా పరమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు ఈ విన్యాసాలు తోడ్పడతాయని నౌకాదళం వెల్లడించింది.
నౌకాదళానికి చెందిన విమానాన్ని డోర్ నియర్ విమానం ద్వారా యాంటీ హైజాక్ ఆపరేషన్ను అధికారులు సమన్వయం చేశారు. అనంతరం ఉగ్రవాదులను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు దళాలు సన్నద్ధత ఏ రకంగా ఉండాలన్నదానిపైనా సమగ్రంగా చర్చించారు. జాతీయ పౌర విమానయాన భద్రత కార్యక్రమం కింద ప్రతి ఏటా అన్ని విమానాశ్రయాల్లో ఈ విన్యాసాలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.