విశాఖకు చెందిన వేణుగోపాల్ ఆంధ్ర విశ్వవిదాలయలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తరువాత వివిధ ప్రాంతాలలో పని చేశారు. సొంతంగా ఏదైనా ఆవిష్కరణ చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. పదేళ్లుగా వివిధ అంశాలపై దృష్టి సారించి కృషి సాగిస్తూనే ఉన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు ఉపయోగపడే పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చే సాంకేతిక అంశాలపై తన బృందంలోని సభ్యులతో కలిసి పరిశోధన సాగించారు.
* గదుల్లోని గాలిలో వైరస్, బాక్టీరియాను హరించి వాయువును స్వచ్ఛంగా మార్చటానికి పలు నమూనాలను పరిశీలించారు. ఎట్టకేలకు విజయ ఫలాలు అందుకున్నారు. తన సంస్థకు ‘అహబౌనా మెక్ట్రానిక్స్’ అని పేరు పెట్టారు.
పరికరానికి పేటెంట్...
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గాలి ద్వారానూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వేణుగోపాల్ మరింత వేగంగా పరిశోధనలు నిర్వహించిన ఫలితమే ఈ నూతన పరికరం. దీనికి జాతీయ పరి శోధనా అభివృద్ధి సంస్ధ(ఎన్‌ఆర్‌డీసీ) పేటెంట్ కూడా లభించింది. ఫలితంగా వాణిజ్యపరంగా ఉత్పత్తికి బాటలు పడ్డాయి.
ప్రత్యేకతలు: ‘ఈ పరికరం ధర తక్కువ. నిర్వహణ కూడా అంత కష్టంగా ఉండదు. దీనిని ఆసుపత్రుల్లో, ఇళ్లలోనూ ఉపయోగించేందుకు వీలుగా తయారు చేయవచ్ఛు వాణిజ్య పరంగా ఉత్పత్తి జరిగితే ఒక ఏసీ మిషన్‌లా ప్రతి ఇంట్లోనూ ఇది కొలువు దీరే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల్లో ఈ పరికరానికి తగిన సామగ్రి తయారు చేయించి...అన్ని జత చేసే ప్రక్రియతో పూర్తి ఉత్పత్తిని విశాఖలో చేయనున్నాం’ అని వేణుగోపాల్ చెబుతున్నారు.