Amruta Organic food for patients: విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఈయన పేరు ద్వారపురెడ్డి రామ్మోహన్ రావు. భార్య కూడా వైద్యురాలు కావడంతో.. ఆమె సాయంతో కర్షక మహర్షి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. నానాటికీ ప్రజలపై పెరుగుతున్న రుగ్మతల ప్రభావం... ఆ వైద్యుడిని ఆలోచింపజేసింది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు... మెరుగైన వైద్య సేవలు అందించటంతో పాటు ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పేదలకు పోషకవిలువలతో కూడిన ఆహారం అందించాలని సంకల్పించారు. వ్యాధుల నుంచి రక్షణ కోసం.. సేంద్రీయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేపట్టారు.
అమృత ఆహార తయారీకి వినియోగించే ఆకుకూరలు, కూరగాయలను పండించడం కోసం రామ్మోహన్ రావు ఇంటిపై ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆకుకూరల సాగుకు షెడ్ నెట్ వేశారు. చెక్కలతో తయారు చేసిన కుండీల్లో తోటకూర, పాలకూర, కొత్తిమీర, ముల్లంగి, పుదీనా... ఇలా దాదాపు 13రకాల ఆకుకూరలను పండిస్తున్నారు. ఆసుపత్రితోపాటు ఇంటి ఆవరణలోనూ సేంద్రీయ ఎరువులతో కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, జీడి, ఖర్జూరం... సుమారు 30రకాలు సాగు చేస్తున్నారు. పచ్చి కూరగాయలు, ఆకుకూరలను పచ్చడిగా చేసి కొంచెం తేనె కలిపి అమృత ఆహారం తయారు చేస్తున్నారు. షోషకాహార ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని రామ్మోహన్‌రావు అంటున్నారు.
ఇదీ చదవండి :IT employees visit farm schools : పొలాల బాట పట్టిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే?
" అమృత ఆహారానికి పనికి వచ్చే ఆకుకూరలను సేంద్రీయంగా పండిస్తున్నాం. ప్రతీ 15రోజులకు ఆహారంగా స్వీకరించడానికి ఈ ఆకుకూరలు సిద్ధం అవుతాయి.రోజుకు 300-400మందికి సరపడే ఆకుకూరలను ఇక్కడ పండిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచడం, జబ్బులు రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారంతోనే సాధ్యం. ఆహారమే ఔషధం. వండకుండా తినడమే ప్రస్తుత ఆరోగ్య సూత్రం. " -రామ్మోహన్ రావు, వైద్యుడు