విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం, కార్మిక నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూర్మన్నపాలెం నుంచి దువ్వాడ వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం తిరిగి కూర్మన్నపాలెం చేరుకున్న కార్మిక నాయకులు.. స్టీల్‌ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల కాలనీల్లో పాదయాత్ర చేశారు. మరోవైపు ప్రైవేటీకరణనను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో కార్మిక సంఘాలు చేపట్టిన దీక్ష 164వ రోజుకు చేరుకుంది.
న్యాయపోరాటం చేస్తాం: స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు
దిల్లీలో ఉక్కుశాఖ మంత్రి, ఇతర నేతలను కలిశామని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తెలిపారు. అయినా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందనే నమ్మకం కలగలేదని చెప్పారు. ప్రైవేటీకరిస్తే తమ భూములు ఇవ్వాలని పోరాడుతామని.. లేనిపక్షంలో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించినట్లు స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులు వెల్లడించారు.