భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉందని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి పళ్లంరాజు అన్నారు. విశాఖ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్ క్లబ్లో భారత ఆర్థిక వ్యవస్థపై మాట్లాడారు. 'నేషనల్ శాంపిల్ సర్వే' అధ్యయనం ప్రకారం దేశంలో 8.91% నిరుద్యోగం ఉందనీ.. 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇండస్ట్రీ' సర్వే ప్రకారం అది 8.5 శాతంగా ఉందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం 4.9 శాతం మాత్రమే ఉందన్నది గుర్తించాలన్నారు.
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5 శాతంగా ఉందనీ.. ఈసారి వృద్ధి శాతం ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉందని.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, రిజర్వ్ బ్యాంకు అంచనా వేస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థని పురోగమన దిశగా నడిపించే మౌలిక రంగాలైన బొగ్గు, విద్యుతు, సిమెంటు, నిర్మాణ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పళ్లంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడంలో విఫలమైందనీ.. కశ్మీర్, అయోధ్య వంటి అంశాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.