విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్-1లో ప్రయాణికుల కోసం అధునాతన విశ్రాంత ప్రాంగణం (లాంజ్) అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. గురువారం తూర్పు కోస్తా రైల్వేజోన్ జీఎం విద్యా భూషణ్ ప్రారంభిస్తారని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.35 లక్షలతో లాంజ్‌ను ఆధునీకరించారు. రాష్ట్రంలో ఏ రైల్వేస్టేషన్‌లో లేని విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికులు అబ్బురపడే ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్నాయి.
- లాంజ్ మొతాన్ని ఆటోమేషిన్ వ్యవస్థతో అనుసంధానించారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీ తదితర ఎలక్ట్రికల్ ఉపకరణాలు మాటలతో ఆన్, ఆఫ్ అయ్యే సాంకేతికతను తీసుకొస్తున్నారు. ఇది ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నారు.
- మాటలకు ప్రత్యామ్నాయంగా కేవలం తాకడంతోనే పనిచేసే స్విచ్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు.
- ప్రయాణికులకు విలాసంగా ఉండేలా మసాజర్ సోఫాలు, వాలుగా కూర్చొనే రిక్లైనర్ సోఫాల్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు కాసేపు సేదతీరే ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు.
- మరుగుదొడ్లలో నీటి ఆదా కోసం సెన్సార్లను పెట్టారు. అవసరమైన మేరకు నీటి వినియోగం ఉండేలా చూస్తున్నారు.
బీ జీఎం విద్యాభూషణ్ గురువారం పర్యటనలో రైల్వే స్టేషన్ బయట ఉన్న నూతన ఆర్చ్‌ను కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. అనంతరం హెచ్‌పీసీఎల్, ఎన్‌టీపీసీలకు వెళ్తారని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.