Cattle lover in visakhapatnam: విశాఖపట్నం పెద వాల్తేరు ప్రాంతంలో ఓ ఇరుకు వీధిలోకి మూగజీవాలు ఒక నిర్ణీత వేళకు బారులు తీరుతాయి. ఇవన్నీ ఎందుకు ప్రతిరోజూ ఒకే సమయంలోనే ఆ ఇంటి వద్దకు చేరుతాయని పరిశీలించిన వారికి మాత్రం... ఆశ్చర్యం కలిగే అంశం తెలుస్తుంది. అక్కడ నివాసం ఉండే ఓ మహిళ.. వాటికి నిత్యం రెండు పూటలా ఆహారం పెడుతున్నారు. కుట్టుపని చేసి సంపాదించే మొత్తాన్ని తన జీవనం కోసం కొద్దిగా ఉపయోగించి.. మిగిలినదంతా ఈ మూగజీవాలకోసమే వెచ్చిస్తున్నారు.
ఆవులు, పిల్లులు, కుక్కలు.. ఇలా మూగజీవాలన్నింటికి ఆమే స్వయంగా పేర్లు పెట్టి... వాటిని పిలుస్తుంటారు. ఉదయం ఒక సమయంలో పిల్లులు, కుక్కలు వస్తాయి. మరో సమయంలో ఆవులు వచ్చి చేరుతాయి. సాయంత్రం కూడా అదే విధంగా ఈ మూగ జీవాలు ఇక్కడికి వస్తాయి. ఈ ప్రాంత వాసులకు ఈ దృశ్యాలన్నీ నిత్యం దర్శనమిస్తుంటాయి. నిత్యం వాటికి సమయానికి అహారం అందించడం కోసం.. శ్రమించడంలో ఆనందం పొందుతున్నట్లు ఆమె చెబుతున్నారు.