ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫార్మా కంపెనీలో వరుస ప్రమాదాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం - fire accidents in visakha news

విశాఖలోని పరవాడలో అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. గత ఏడు నెలల కాలంలో సంస్థలో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ప్రమాదాలు ఫార్మా కంపెనీలో నిర్వహణా లోపాలను ఎత్తిచూపుతున్నాయి.

వరుస ప్రమాదాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
వరుస ప్రమాదాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

By

Published : Jul 14, 2020, 9:34 AM IST

విశాఖ జిల్లా పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో ప్రమాదాలకు అడ్డుకట్ట పడలేదు. గత జూన్‌ 29న అర్ధరాత్రి సాయినార్‌ ఫార్మా కంపెనీలో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ లీకై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సోమవారం రాత్రి విశాఖ సాల్వెంట్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాలపైకి భారీగా పొగ చొచ్చుకురావటంతో జనం నానా ఇబ్బందీ పడ్డారు. ఫార్మాసిటీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మంటలు చెలరేగడం గమనార్హం.

  • 14 ఏళ్ల క్రితం 2400 ఎకరాల్లో ఏర్పడిన ఫార్మాసిటీలో 85 సంస్థలున్నాయి. సుమారు 32 వేలమంది ఉద్యోగులున్నారు. ఇక్కడ ఔషధ ఉత్పత్తుల తయారీలో రియాక్టర్లే కీలకం. వీటి సామర్థ్యం 1 కిలో లీటర్ల నుంచి 12 కిలో లీటర్ల వరకు ఉంటుంది.
  • మండే గుణం గల రసాయన పరిశ్రమల్లో భద్రత అనేది అత్యంత కీలకం. కానీ.. కొన్ని పరిశ్రమల్లో ఏమాత్రం పట్టించుకోవటం లేదు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. ప్రభుత్వ విభాగాల తనిఖీలు నామమాత్రంగానే ఉంటున్నాయి.
  • తరచూ విషవాయువులు లీకవడం, అగ్నిప్రమాదాలు సంభవించడంతో కార్మికులు, ఉద్యోగుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని కార్మిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • రియాక్టర్ల వద్ద షిఫ్ట్‌ ఇన్‌ఛార్జి పర్యవేక్షణలో కెమెస్టులు, హెల్పర్లు ఉంటారు. వీరికి పూర్తిస్థాయి భద్రత పరికరాలు అందించాలి. వారిలో నైపుణ్యం ఉండాలి. ప్రమాదకరమైన రసాయనాలు కలిపేటప్పుడు శరీరం మొత్తాన్ని కప్పి ఉంచేలా ఆక్సిజన్‌తో కూడిన సూట్‌ అందించాలి. మాస్కులు, బూట్లు, గ్లౌజులు, శిరస్త్రాణాలు, కళ్లకు రక్షణ పరికరాలు, సేప్టీ బెల్ట్‌ తదితరాలను అందించాలి. సాంకేతిక కారణాల వల్లనో,, మానవ తప్పిదం వల్లనో విష వాయువులు లీకైనా, అగ్నిప్రమాదాలు సంభవించినా సరైన భద్రత ఉంటే కనీసం కార్మికుల ప్రాణాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది. సూట్‌ల ఖరీదు ఎక్కువ కావటంతో చాలావరకు సంస్థలు వాటిని సమకూర్చడం లేదు. కొన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వటం లేదు.
  • ప్రమాదాలు సంభవించినప్పుడు కమిటీలు వేయడం, దర్యాప్తు చేయించడం, సేఫ్టీ ఆడిట్‌ కమిటీలతో తనిఖీలు చేయించడం చేస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు. విషవాయువులు లీకైనా, ప్రమాదాలు సంభవించినా ప్రాణాలరచేతపట్టుకుని బతకాల్సి వస్తోందని పరిసర తాడి, తానాం తదితర గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

నిపుణులున్నారా...?

రసాయనాలకు చెందిన ముడి పదార్థాలను సమపాళ్లల్లో రియాక్టర్లలోకి సరిపడా ఉష్ణోగ్రతలో పంపుతుంటారు. ప్రమాదకరమైన రసాయనాలను కలిపే సమయంలో విషవాయువులు బయటికి వెలువడకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. ఈ విషయంలో సాంకేతిక పద్ధతులు పాటించకపోయినా... పద్ధతి ప్రకారం చేయకపోయినా...ఏ చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

గత ఏడు నెలల్లో ఏడుగురు

పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో గత ఏడు నెలల కాలంలో రియాక్టర్ల నుంచి విషవాయువులు వెలువడి, ఇతర ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • సాయినార్‌ ఫార్మాసంస్థలో ఇద్దరు మృతి, నలుగురికి అస్వస్థత
  • స్మైలెక్స్‌ ఫార్మాలో ఇద్దరు
  • విజయశ్రీఫార్మాలో ఒకరు మృతి, పదిమందికి అస్వస్థత
  • అల్కలి మెటల్‌ఫార్మాసంస్థలోని రెండో అంతస్తులో సెంట్రింగ్‌ పనులు చేస్తూ కిందపడి ఒకరు
  • ఏక్టిస్‌ జనరిక్స్‌ ఫార్మా కంపెనీలో 3వ అంతస్తులో పెయింటింగ్‌ చేస్తూ కిందపడి ఒకరు మృతి చెందారు.

వీటిని సరిచేసుకుంటేనే...

ఫార్మాసిటీలో ఇంతవరకు చోటుచేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు కొన్ని లోపాలను ఎత్తిచూపుతున్నారు.

  • సేఫ్టీ ఆడిట్‌ కమిటీ సూచించిన లోపాలను సరిచేసుకోకపోవడం
  • కార్మికులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకపోవటం.
  • వివిధ రసాయన చర్యలప్పుడు ఎలా వ్యవహరించాలో కార్మికులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవటం.
  • కొన్ని పరిశ్రమల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించకపోవటం. భద్రత కమిటీలు లేకపోవటం.
  • యంత్రాల నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడం
  • పరిశ్రమలపై ప్రభుత్వ యంత్రాంగాల పర్యవేక్షణ కొరవడడం....
  • వివిధ ప్రమాదకర రసాయనాలను దగ్గదగ్గరగా నిల్వ ఉంచడం.
  • నిపుణుల పర్యవేక్షణ లేకుండా రసాయనాలకు దగ్గరగా వెల్డింగ్‌, సోల్డరింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులు చేయించడం.

ప్రమాదాలు ఇలా

ఫార్మాసిటీలో ఇప్పటివరకూ జరిగిన చిన్న, పెద్ద ప్రమాదాలు 59
ఇప్పటివరకూ జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారు 38
ప్రమాదాల్లో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 91

ఇదీ చూడండి..

విశాఖలో అర్థరాత్రి అలజడి... అసలేం జరిగిందంటే..?

ABOUT THE AUTHOR

...view details