విశాఖ పోర్టు చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. తూర్పు తీరాన్ని ఏసియా ట్రాన్సిప్మెంట్ హబ్‌గా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. విశాఖ నౌకాశ్రయానికి అతి భారీ నౌకలు వచ్చే విధంగా జరిగిన అధ్యయనాలు ఎట్టకేలకు కార్యరూపం దాల్చాయి. ఎంటీ ఓస్లో అనే కార్గోనౌక దాదాపు 90 వేల టన్నుల లోడుతో ఇక్కడి నౌకాశ్రయానికి చేరింది. కెప్టెన్ శర్మ నేతృత్వంలో ఇన్నర్ హార్బర్లోని ఈక్యూ 7 బెర్త్ వద్ద అన్ లోడింగ్ జరుగుతోంది. 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల బీం(వెడల్పు) ఉన్న ఇంతటి భారీ నౌక ఇన్నర్ హార్బర్లోకి తొలిసారిగా వచ్చిందని పోర్టు వర్గాలు తెలిపాయి. ఇందులో మొత్తం 87,529 మెట్రిక్ టన్నుల లోడు ఉందని వెల్లడించింది.
ప్రత్యేక అధ్యయనం
విశాఖ పోర్టులో ఇంతవరకు కేవలం 230 మీటర్ల పొడవు, 32.5 మీటర్ల వెడల్పు ఉన్న నౌకలను మాత్రమే హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. భారీ నౌకలు వచ్చేందుకు వీలుగా విశాఖ పోర్టు అధికారుల బృందం 2019 సెప్టెంబర్‌లో డిప్యూటీ ఛైర్మన్ పీఎల్ హరనాథ్ నేతృత్వంలో ఒక బృందం సింగపూర్‌లో ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. సింగపూర్‌కి చెందిన ఫోర్స్ టెక్నాలజీస్ సంస్థ... విశాఖపట్నం పోర్టుతో కలిసి అధ్యయనం నిర్వహించింది.