విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ వసతి గృహాల్లో 66కిపైగా కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో జిల్లా యంత్రాంగ పూర్తిస్దాయిలో దృష్టి పెట్టింది. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ప్రాంతీయ కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ పీవీ సుధాకర్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ సహా అధికారుల బృందం ఈ హాస్టళ్లను సందర్శించింది. మొత్తం విద్యార్దులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. ఇప్పటివరకు బయటపడిన పాజిటివ్ కేసుల్లో ఎవ్వరికి తీవ్ర లక్షణాలు లేవని, కొంతమందికి మాత్రం కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు. వారందరిని ప్రత్యేకంగా ఉంచి అవసరమైన చికిత్స అందిస్తున్నామని వివరించారు. వసతి గృహాల్లో ఉండడం వల్ల వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందిందని అంచనా వేస్తున్నామని, ఇంజనీరింగ్ బాయ్స్ హాస్టల్లోనే హోం క్వారంటైన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చామని, ఎవ్వరూ ఎటువంటి అందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదంతా కంటైన్మెంట్ జోన్‌గా పరిగణించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టినట్టు, శానిటైజేషన్ ప్రక్రియ జీవీఎంసీ మొదలు పెట్టిందని చెప్పారు.
పరీక్షలన్నీ వాయిదా..తరగతులన్నీ ఆన్లైన్