విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ కుప్పకూలటంతో 11 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో క్రేన్ కేబిన్‌లో ఉన్న 10 మందితో పాటు మరొకరు మృతిచెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
క్రేన్ సామర్థ్యం పరిశీలిస్తుండగా ప్రమాదం
హుద్‌హుద్ తుపాను సమయంలో షిప్ యార్డ్‌లోని పాత భారీ క్రేన్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఇటీవలే దాదాపు 12 కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త క్రేన్‌ను షిప్‌యార్డు యజమాన్యం కొనుగోలు చేసింది. దీని నిర్వహణ బాధ్యతలను పొరుగు సేవలకు అప్పగించింది. బిల్డింగ్ డాక్-షిప్ వే బెర్త్‌కు మధ్య ట్రాక్‌పై కొత్త క్రేన్ సామర్థ్యం పరీక్షిస్తుండగా ప్రమాదం జరిగనట్లు సమాచారం. భోజన విరామ సమయానికి ముందు ఈ ఘటన జరిగింది. సామర్థ్యానికి మించి బరువు ఎత్తే క్రమంలో కూలిందా?... క్రేన్ కింద ఉన్న బేస్ బలహీనంగా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదంపై రెండు కమిటీలు
క్రేన్ కూలిన ప్రమాదంలో 11 మంది మృతిచెందారని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. క్రేన్ ఆపరేషన్, మేనేజ్‌మెంట్‌లో మొత్తం 3 కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయని వివరించారు.
మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్ ఉద్యోగులు. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెందినవారు. క్రేన్ కుప్పకూలిన సమయంలో కేబిన్‌లో 10 మంది ఉన్నారు. కేబిన్‌లో ఉన్న 10 మందితో పాటు మరొకరు మృతిచెందారు. మృతుల్లో 10 మంది వివరాలు గుర్తించాం. మరొక మృతుడి వివరాలు సేకరిస్తున్నాం. హెచ్‌ఎస్‌ఎల్ ప్రమాదంపై రెండు కమిటీల ఏర్పాటు చేస్తున్నాం. ప్రమాద కారణాల కోసం కమిటీ ఏర్పాటుకు హెచ్‌ఎస్‌ఎల్ ఛైర్మన్‌ను కోరాం. ఏయూ మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణులతో ఒక కమిటీ.. ప్రభుత్వం ఇంజినీరింగ్ విభాగం నుంచి మరొక కమిటీ వేస్తాం- వినయ్ చంద్, విశాఖ జిల్లా కలెక్టర్