రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 3 స్థానాలకు అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవం(ysrcp unanimous 11 Local body MLCs in Andhra Pradesh) కాగా... స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించగా అధికార వైకాపా నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేయని కారణంగా ఆ పార్టీ నేతలు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. అన్ని జిల్లాల్లోనూ అధికార వైకాపా నేతల నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. పోటీ లేకపోవడంతో 11 స్థానాలూ ఏకగ్రీమమైనట్లు స్థానిక ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారుల నుంచి అభ్యర్థులు అధికారికంగా ధ్రువపత్రాలు అందుకున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్, ఇషాక్ భాషా, గోవిందరెడ్డి ఇప్పటికే ఏకగ్రీవమయ్యారు. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలూ ఇప్పుడు ఏకగ్రీవం కావడంతో మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైకాపా కైవసం(ysrcp unanimous 11MLCs) చేసుకున్నట్లైంది.
ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా రెండూ కలపి 14 ఎమ్మెల్సీ స్థానాలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు.. మొత్తం 7 స్థానాలు, మిగిలిన 7 స్థానాలను ఓసీలకు వైకాపా కేటాయించింది. బీసీ, మైనార్టీలకు మొత్తం 6 స్థానాలు కేటాయించగా.. ఎస్సీ మాదిగకు 1 కేటాయించారు. కాపులకు 2, క్షత్రియులకు 1, కమ్మ 2, రెడ్డి కులస్థులకు 2 స్థానాలు కేటాయించారు. ఇప్పటికే శాసన మండలిలో 18 మంది వైకాపా సభ్యులు ఉన్నారు. వీరిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు. కొత్తగా ఎన్నికైన 14 మందితో సభలో వైకాపా బలం 32 మందికి చేరింది. 18 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీల అభ్యర్థులు ఉంటారు. సభలో తొలిసారి నలుగురు మైనార్టీలకు చోటు దక్కింది.