అధికారంలోకి వచ్చాక తొలిసారి వైకాపా ప్లీనరీ నిర్వహించనుంది. ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో రెండు రోజులపాటు ప్లీనరీ ఉంటుంది. ఎన్నికల్లోపు మరో ప్లీనరీ ఉండదు కాబట్టి దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. సుమారు 4 లక్షల మందికి పైగా జనసమీకరణ చేపట్టే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు అనుగుణంగా ప్లీనరీ వేదిక పక్కనే దాదాపు 40 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. రెండో రోజు సాయంత్రం వైకాపా అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. రోజుకు అయిదు చొప్పున రెండు రోజుల్లో 10 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. పార్టీ నియమావళి సవరణ ప్రతిపాదననూ తొలిరోజునే ఆమోదించనున్నారు. అదేరోజు మహిళా సాధికారత- దిశ చట్టం, విద్య, వైద్యం, ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), పరిపాలన-పారదర్శకత, రెండో రోజు సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ఎంఎస్‌ఎంఈ-ప్రోత్సాహకాలు, దుష్ట చతుష్టయం అనే అంశాలపై తీర్మానాలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
కార్యక్రమాలు ఇలా..:దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8) సందర్భంగా వేదికపై ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్ పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. తర్వాత ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ మొదలుకానుంది. వెంటనే పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటన చేయనున్నారు. తర్వాత పార్టీ నియమావళి సవరణ తీర్మానాన్ని ఆమోదిస్తారు. తర్వాత రాజకీయ తీర్మానాలు ప్రవేశపెడతారు. రెండోరోజు వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రసంగం ఉంటుందని షెడ్యూలులో పేర్కొన్నారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత జగన్‌ను మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. తర్వాత ఆయన ప్రసంగంతో ప్లీనరీ ముగియనుంది.