జగన్ కేబినెట్‌లో బెర్తు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి జగన్.. వారిని సచివాలయానికి పిలిపించుకొని బుజ్జగిస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస రెడ్డి , పార్థసారధి, సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుజ్జగించారు. మొన్నటి వరకు హోంమంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత.. తనను కేబినెట్‌లో కొనసాగించకపోవడంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన మంత్రుల్లో 11మందిని కొనసాగించి తనకు అవకాశం ఇవ్వకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా మంత్రి పదవి రాలేదంటూ అలకబూనారు.
వీళ్లద్దరినీ ఇవాళ క్యాంపు కార్యాలయానికి పిలిపించిన ముఖ్యమంత్రి.. అందరినీ సర్దుబాటు చేయటం వల్ల మంత్రి పదవులు ఇవ్వటం కుదరలేదని చెప్పినట్లు తెలిసింది. సామాజిక సమీకరణాలు, కొత్తవారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొందరు సీనియర్లకు పదవులు రాలేదని..భవిష్యత్తులో జిల్లా అభివృద్ధి కమిటీ ఛైర్మన్లుగా మంత్రి హోదాతో కూడిన పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. 2024 ఎన్నికల్లో పార్టీ గెలవటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. భవిష్యత్తులో అవకాశం ఉంటే పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం మాట్లాడిన సుచరిత.. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిగా ఉండటం వల్లే బయటకు రాలేదన్నారు. కేబినెట్ నుంచి తొలగించినందుకు ఎలాంటి బాధా లేదన్నారు. తాను అసంతృప్తితో లేనని పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ తనను గుర్తించి, గౌరవించిన పార్టీ పట్ల ఎప్పటికీ అభిమానం తగ్గదన్నారు.
ఇన్నాళ్లూ అవకాశం కల్పించారని ధన్యవాదం తెలుపుతూ రాసిన లేఖ అది. మా అమ్మాయిది చిన్న వయసు. తనకు అవగాహన లేక మీడియా ముందు ఎలా చెప్పాలో తెలియక రాజీనామా అంటే దాన్నే హైలైట్ చేశారు. మీడియా చేసినదాన్ని నేను తప్పు పట్టడం లేదు. నేను రాజకీయాల్లో ఉంటే జగన్ వెంటే, వైకాపాలోనే ఉంటా. వేరేవైపు చూడాల్సిన అవసరం లేదు. రాజకీయాల నుంచి విరమించుకున్నా వైకాపా కార్యకర్తగానే ఉంటా. ముఖ్యమంత్రి జగన్ నన్ను చెల్లి అని సంబోధిస్తారు. ఆయన అదే ప్రేమనూ ఇప్పుడూ చూపుతున్నారు. ముఖ్యమంత్రిని మా కుటుంబసభ్యులం వచ్చి కలిసే స్వేచ్ఛ మాకు ఎప్పుడూ ఉంది. ఇప్పుడు కూడా మా అబ్బాయిని తీసుకుని వెళ్లి సీఎంను కలిశా. నాకు ఆపరేషన్ జరిగి రెండు వారాలు కూడా కాలేదు. అయినా ఓపిక చేసుకుని వచ్చి ముఖ్యమంత్రిని కలిశాను. ఎందుకంటే నేను రాజీనామా చేశానని, స్పీకర్‌కు లేఖ పంపానని, సీఎం నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, నాపైన చర్యలు తీసుకోనున్నారని వస్తున్న ప్రచారాలకు తెరదించేందుకే. నావల్ల జగన్‌కు ఏ చిన్న ఇబ్బందీ రాకూడదనేదే నా ఉద్దేశం. మంత్రివర్గంలో రెండున్నరేళ్ల తర్వాత మార్పులుంటాయనీ సీఎం ముందే చెప్పారు. అయితే మనిషిని కదా మంత్రివర్గంలో చోటు కోల్పోయినప్పుడు చిన్న భావోద్వేగానికి గురయ్యా. సాధారణ దళిత మహిళనైన నేను ఎన్ని జన్మలెత్తితే, ఎన్ని సొమ్ములు ఖర్చు చేస్తే హోం మంత్రిని కాగలను. అలాంటిది నన్ను హోం మంత్రి స్థాయికి సీఎం తీసుకువచ్చారు. మా కార్యకర్తలం, మేమంతా వైకాపా గెలుపు కోసమే కృషి చేస్తాం. - సుచరిత, మాజీ మంత్రి