ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. వ్యవస్థల్లో ఉన్న తన వారితో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తన హయాంలో రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించి కాలం గడిపి.. రెండేళ్లుగా ప్రభుత్వంపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి పై ఈడీ కేసు పెట్టి ఛార్జిషీట్ దాఖలు చేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం సాధించారని.. మహనాడు నిర్వహిస్తున్నారో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్ధితిలో లేరని అన్నారు. ప్రజల దీవెనలు వైఎస్ జగన్కు ఉన్నాయని, ఎన్నితిట్టినా, ఏం చేసినా.. వచ్చే 20 ఏళ్లు సీఎంగా జగన్ ఉంటారన్నారు. జూమ్ మహానాడులో రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎంపై నిందలు వేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు.